Posts

Showing posts from April, 2020

ఏదేమైనప్పటికీ...

రోడ్లని మాత్రం తిన్నగా నిర్మించాం ‘పట్టా ’ లతో బాటు రోడ్లనీ చదువుకున్నాం మీ వూరికి రోడ్డుందా! అని కుశలమడిగాం రోడ్లకి ఓపిక ఎక్కువ కిక్కిరిసిపోయినా కిక్కురుమనవు వేగాన్ని అదుపుచేయడానికి మలుపు తిరుగుతాయి పండగలు పబ్బాలు బైఠక్ లకూ,అన్నిటికీ అడ్డాలవుతాయి ఇల్లు వదిలిన దారిద్ర్యానికి కాళ్ళవుతాయి రోడ్డెమ్మటే చెట్లతో బాటు రోడ్లకి ఇల్లుంటే బాగుండు ఏదో పోగోట్టుకున్నదిలా వుండదు మనని పలకరించే నియాన్ కాంతి   గొట్టం నవ్వుతున్నట్టు౦టుంది ఏదేమైనప్పటికీ... రోడ్లు ఎదిగాయి వలస పక్షుల గూళ్లయ్యాయి చెదిరిపోతున్న సంబంధాలకు ‘సెల్ ’ ఫోన్ లయ్యాయి . ( 98)

కొన్ని హిందీ కవితల అనుసృజన

మబ్బుల చాటునుండి వస్తున్న చంద్రుడు ఎవరినైనా వెతకడానికా,లేక తనని తాను ప్రదర్శించుకోడానికా! ( 6-6-96) - తిరుగుతున్న ఆగిన సైకిల్ పెడల్స్ తాడు లేని బొంగరం ( 7-6-96) - నాల్గు మాటల కోసం నాల్గు గోడలు మనసులోని మాట పెదవుల పై బందీ అయ్యింది - నదిలో వెన్నెల కాగితపు పడవా లేక అందని ప్రేమలేఖా! ( 96)

పూలు - పండ్లు

నేల పైన రాలిన వేప పూలు పసి పిల్లల తప్పటడుగుల ఆనవాళ్ళు (6-4-2020) - నింగిని తూర్పారపడితే రాలిన నక్షత్రాల కాంతి చెట్టు నేల చెంతన కానుగ పూలు ( 8-4-2020) - చెట్టు పై నుండి ఎగిరే పక్షి రెక్కల చప్పుడు నేల పై   రాలిన ఉసిరి కాయలు వాకిలి మువ్వల చెట్టు ( 9-4-2020 ) - దానిమ్మ పాదులోని నీళ్ళల్లో తేలుతున్న మునగ పూలు నింగి గదిలో ఆమె రాక కోసం తచ్చాడుతున్న చంద్రుడు (10-4-2020)

నేను నా గది

సీసాలో అతుక్కు పోయిన చివరి నీటిచుక్కలా ఒంటరిగా బిగుసుకుపోతాయి జ్ఞాపకాలు - గది విడ్కోలప్పుడు వెనుదిరిగిన చూపు తలంపుల మంచం మీద వాలిన ఆలోచనల కళేబరం పైకప్పుకంటుకున్న నేత్ర నక్షత్రం గది దాపరికం లేని తలలోని నాలుక గది అడుగుల గుర్తులంతిల్లు నా మటుకు నాకు గది నా సమాధి మన్ను మీద వాలిన మట్టి ఆకు నా శిలాక్షరం ( 1-8-2016)

పిచ్చుకలు

గూళ్ళలలో మా గుండెల్ని పచ్చగా పొదగడానికి మా బాల్కనిలోని తీగలకున్న ఎండు పుల్లల్ని తీసుకుని పోతాయి ( 3-4-2020)

తుది కలయిక

చివరి కలయికప్పుడు చెప్పిన మొదటి మాట ప్రతిరోజూ అందర్నీ కలిసి స్నేహం చేయాలి చివరి రోజు కోసం ప్రతి రాత్రి దీపాలు వెలిగించాలి చివరి కలయికప్పుడు సమూహాల్లో కలవద్దు పొడి పొడి నవ్వుల్ని పులుముకోవద్దు బంధాలకు వూపిరాడని ఇనుప కౌగిలింతలొద్దు చివరి మాటకు పయనముంటుంది ప్రతీది అర్ధమయ్యేటట్లు చెప్పలేం అందుకే చెప్పే పద్ధతిని మార్చుకుందాం రావాల్సిన   వారు రాకపోతే వచ్చిన వారి గురించే మాట్లాడుదాం ఎవరూ, ఎవర్నీ వదిలిపోరు మనందరి   కనురెప్పలకు పచ్చటి కాటుకద్దాలి విడిపోయే ముందు దానిని పచ్చ బొట్టుగా పెట్టుకుందాం ఇది నా చివరాఖరి మాట సూర్యుడు నా గదిలో అస్తమిస్తాడు రేపు చీకటిని తొలుచుకుంటూ వస్తా కలిసే సమయం, స్ధలం మార్చేస్తా దేహ ధూప కాంతి పరిమళాన్ని మీ ముని వాకిలిలోని   తులసి మొక్క కుండీకి ఎరుపు ,పసుపు బొట్టులా ... ( జనవరి- 98, నా పాత హిందీ కవితకు అనుసృజన -13-4-2020)

కిటికీ రెక్క

సాయంత్రం పక్షులు గూటికి చేరిన సవ్వడి కిటికీలు మూసేశాను నల్లటి కిటికీ అద్దంలో చెట్టు చాటునుండి సూర్యుడు అస్తమయం ఉదయం మసక చీకట్లో కనిపించని పక్షుల కూతలు కిటికీలు తెరిచాను... కిటికీ రెక్క రేయింబవళ్ళ రాకపోకలను పలకరించే పక్షులకూత ( 4-4-2020)

ఘర్ వాపసి

నేను   తరచూ అనుకుంటాను నా శరీరాన్ని ప్రపంచం ఎట్లా   భుజిస్తుందని ఇదంతా ప్రపంచంలోని   ఓ మూలన కూర్చున్న కాల   స్ధలంలో ఆలోచిస్తాను ఆవరణలోని   గాలికి  రంగు , రుచి , వాసన వుంటాయి అవి నా ఆలోచన శరీర పరిమళాన్ని   పరివ్యాపిస్తాయి వంట వండుతునప్పుడు వచ్చే కూరల గుభాళింపులా . మనం మన ఆలోచనల శరీర బందీలం. ఎక్కాడా ఎవరూ వుండరు! అంతా జ్ఞాపకాల మట్టి పుట్టల్లో చీమల్లా వుంటారు , వాళ్ళని నెమరేసుకునే నాలుకకి రుచిలేదు , అంతే!! చీడ పట్టిన దుర్భర ఆలోచనకంటే మరో వైరస్ క్రిమిలేదు ఇల్లు లేని వాళ్ళం , ఇల్లొదిలి తిరిగే తిరుగుబోతులం , ప్రకృతిని చూడలేని గుడ్డివాళ్ళం , ఇంట్లో వుండడం అంటే బందిఖానా అనుకునే వాళ్ళం పురుడు , పుటుక , పెళ్ళి , చావు అంతా కాగిత పత్రాల పై ఆధారపడిన వాళ్ళం కొనితెచ్చుకున్న చావుకి ఇంటిని ఆసుపత్రి  చేసుకున్న  వాళ్ళం అసమాజిక జీవులం ఇక ఆలోచనలకి   ఘడియలు ఎట్లా పెడతాం బడి , గుడి , అంగడి అన్నీ బంద్ ప్రపంచానికి గాలి సోకింది మనం బతికిన తీరు , చదివిన  చదువు , సంపాదించిన డబ్బు  అంతా తూచ్... రండి ఇంటి దగ్గ...