Posts

Showing posts from May, 2014

నీటి మొహం

చెరువులో ఎవరో రాయి వేస్తే ఏర్పడ్డ వలయాల్లా గుంటాయి మొహాలు నవ్వుతూ ... నవ్విస్తూ ... ఏడుస్తూ ... ఏడ్పిస్తూ ... తడి ఎండుతున్న నీటిలా .. . చెరువులో ఆకులా రాలితే బాగుండు నీటి మొహంలాగుంటుంది బతుకు 29 అక్టోబర్‌ 2000 హైదరాబాద్‌

రొట్టమాకుల తెప్ప

ఉదయం దీప స్థంభం పైన వాలిన పావురాళ్ళు గమ్యం నిర్దేశించుకున్నాయి ప్రయాణం  ఆద్యంతం సరంగు పాటల్లాంటి కబుర్లు ప్రయాణపు బడలిక తీర్చిన ఆకాశ గంగ రొట్టమాకు వాగులో  మజిలీ ఓ మోనోలిత్ చుట్టూ రాలిన ఎండుటాకుల మీద సహచరుల్మంతా  పాదముద్రల దస్తూరిని వదిలి రెక్కలకు  ఊరి మట్టి లేహ్యానద్దుకుని తిరిగి గూటికి చేరాం అప్పటికే నిశాచర రోడ్లకి వెలుతుర్లని పొదిగి పావురాళ్ళు నిష్క్రమించాయి మర్నాడు ఉదయం పసుపచ్చని ఆకుల్లా పావురాళ్ళు నగర గాలికి పచ్చిరొట్ట  కబుర్లందించాయి నింగి పాదాలకి పారాణి రంగంటుకుంది తాజా తీర్మానం... ప్రయాణం గమ్యానికి,  మొదటి, చివరి   అడుగుల  నడుమ అయిస్కాంతపు రేఖల గగనం రండి ఊరెండుటాకుల వ్యోమగామిలో పయనించి వద్దాం (రొట్టమాకు ప్రయాణంలో దారిపొడవున సహచరులైన వారందరికి) (21-5-17)

ఆవరణ

పొద్దున్నే దేవగన్నేరు ఆకుల్లోని వర్షపు చుక్కల కొలనులో పిట్ట స్నానం చేస్తోంది ఆమె నా మదిలో ఈత కొడుతున్న సవ్వడి కొమ్మలపైన ఆకుల నీడల  మీద పిచుకల జంటల కేరింతలు ఆకుల తంత్రుల నుండి ప్రవహించే లేత పచ్చని వెలుతురు పాటలు ఇదంతా నా ప్రహరీ గోడ వెలుపల వాయుగుండం పిదప ఏర్పడిన వాతావరణం మరి సముద్రపు తీరప్రాంతంలో... తలలు వాల్చేసిన వరి చేలు సముద్రపు అంచున పుట్టిన నేల కలయిక,విడిపోయే పక్షి గూటి చూపు నింగి అలల నావ నీటి మట్టి సారం ఇదంతా దేవగన్నేరు  ఆకుల్లోని వర్షపు చుక్కల కొలనులో పిట్ట స్నానం చేసేలోపే రెక్కల సవ్వడి గాలికి   ఏర్పడిన శ్వాస నిట్టూర్పు  (10-5-14)