Posts

Showing posts from July, 2013

ఏటి మాట

నా చివరి కోరిక ఆకుల సంచిలో నా శవ పేటిక కుట్టుకోవాలని జన్మజన్మలకి చావుకి మళ్ళీ  పుట్టుకనివ్వాలని తొలకరి ఆకులకంటిన మట్టి శ్వాసలా... ఆకులకి అటు ఇటు  సూర్యుడు చంద్రుడు నిదురించే నా కళ్ళలోని చీకటి చూపుల ధూళి వెలుగు నుండి ఆవిష్కరిస్తున్న వైతరణి నది పల్లకీ బోయిల్లా... పల్లకీ వెళ్ళిపోయినా బోయీల పాట గాలిలో సదా పరివ్యాప్తి చెందుతుంది *** అర్ధ రాత్రి ఒంటరిగా ఒడ్డున కూర్చోండి పడవ రేవు వెన్నెల వాటి మనసులో అవి పాడుకుంటూ ఒకటితో వొకటి లంగరేసుకుంటాయి ఈ కలయిక  ఆత్మ సమయం దేహం అందుకే సూర్యాస్తమయం ముందే దహన సంస్కారాలు చెయ్యాలేమో! అదీ  యేటి ఒడ్డున!! (31-5-13)

చేప నేత్రం

చేపలు నీటి   గాలి   పటాలు నేల   మీద   రాలుతున్న   పండుటాకుల్లా   నీళ్ళకి   రంగులద్దుతున్నట్టు   ఈదుతుంటాయి ఆకాశాన్ని   నిద్రించని   చేప   కళ్ళతో   నే    చూడాలి రాలే    తోకచుక్క     గాలి   బుడగై   చిట్లుతుంది వైతరణి    దేహంలో    ప్రవహిస్తుంది (20-6-13)

ముసురు

గుబురు   తుమ్మ   చెట్టు   కింద కళ్ళులేని    అమ్మాయి దారి   దాటించే   వారికోసం   ఎదురుచూస్తూ   తనలో   తను    మాట్లాడుకుంటూ   కదలని   మనస్సు   చెట్టు ఆకుల   పెదాలు  గాలి   నవ్వుల్ని   సాగనంపుతూ  ... (29-6-13,  గాంధీ    నగర్   బస్   స్టాప్ )

విరహం ఉర్ఫ్ తన్ హాయి

ఆమె చీరలోని గంజి బిరుసు రాత్రి వెన్నెల్ని మల్లెలుగా చేస్తుంది ఆమె చీరంచుల్ని సరిచేస్తూ పాదాల చెంత కూర్చుంటా ఆమె కొంగుసరిచేస్కుంటూ నా వొంక చూడకుండానే గుండ్రంగా తిరుగుతూ ఆకారానికి చీరెని  ఆవరణగా చుట్టేస్తూ... ఆ..., సరిపోయిందంటూ ... గొయ్యి మగ్గానికి భూమి రంగులద్దుతుంది ఈ మధ్యన వెసులుబాటు పుణ్యమా అని ఆకృతికి సల్వార్ కమీజ్ అల్లుకు పోయింది నూలు చీరలు కట్టడం లేదు అవి బీరువాలో   ముడతలు పడనిబెంగతో   పొద్దున్న  మేడ మీద గాలికి ఎగిరిపోకుండా  గంజితొ తడిసిన చీర అంచుల్ని అంటిపెట్టుకున్న  రాళ్ళు లేవు తడిమరకలు లేవు పగలనుకుంటాను... ఓ మోస్తరు యెడబాటుకు   ఇది కారణం కావచ్చని రాత్రి ఛ... ఇంక నిద్ర లేమి రాక ఛస్తుందా! (18-6-13)

రెసైటింగ్ ఆన్ ఇన్సైడర్స్ ఆంతాలజి

చూపుడు  వేలునుండి  దూసుకు వెళ్ళిన గోలి, అందులోని సీతాకోక  చిలుకలు,తూనీగలు, బోల్డన్ని రంగులు వాటి వెంటే మిత్రులతోకేరింతలు,కనుచూపు వేగంతో కాలాన్ని ఆడించే  రుతువు:బాల్యం కాలం తో మారడం, సాధించలేని వాటి గూర్చి  చెట్టు కింద బెంచి పైన, బీఛ్ కి వీపు చూపిస్తూ వాహనాల్ని  లెక్కెట్టడం,పిచ్చాపాటి   గతాన్ని తోడుకోవడం:ఎదగడం ఇంతలో అల నీడల్ని  ఒడ్డునుండి సంద్రంలోకి లాక్కు  పోతుంది,సూర్యుడు,చంద్రుడు రోజూ మునుగుతున్నట్టే! (30-5-13)

మాలి

కొన్ని అక్షరాలు కొన్ని విత్తనాల్ని జల్లాను వాటి పై గుప్పెడంత  నీటి గింజల్ని రాల్చాను కొన్ని కాగితపు పడవల్లో పయనించాయి కొన్ని అరికాలు కింద  తలపై కడుపునిండా  నీడనిచ్చాయి ఇక  ఈ తోట కబుర్లు  అంతటా పరిమళిస్తాయి ఇల్లు కదలాల్సిన పనిలేదు (16-6-13)