Posts

Showing posts from January, 2015

విద్యుత్ తీగ

కరెంటు తీగలు గాలి పటాల గూళ్ళు పూబంతి ప్రవాహాలు చిరిగిన జ్ఞాపకాల  శ్వాస శబ్దాలు
2. తరచూ కరెంటు స్థంభాల మార్గంలో వెళుతునప్పుడు తీగలకు చుట్టుకుపోయిన పతంగులు చిన్ననాటి ఉత్తరాల  దొంతరలు పురాతనింటి దూలానికి వేళ్ళాడుతూ మిగిలిపోయిన వుబుసుపోని గాలికబుర్ల  మూటల్లా దర్శనమిస్తాయి
3. విధ్యుత్ కోత ఓ అబద్ధం కంట్లోని జలాశయం నుండి విధ్యుత్ ఉత్పత్తవుతుంది
4. వైర్ లెస్ కాలంలో అప్పుడప్పుడు పాత ఉత్తరాల్ని పక్షుల గాలాక్షరాలతో చదువు కుంటాను నాలోని తీగ మీద కనిపించకుండా కూర్చున్న వాళ్ళ అనుబంధాన్ని నెమరేస్కుంటూ
5. ఇంకప్పుడు నాలోని నేను అక్షరాల్లా మీ ఉహాతంతుర్లో తీగనుండి రాలుతున్న మంచు బిందువులా రెపరెపలాడుతూ  తచ్చాడుతాను
(25-1-15,లెనిన్ నగర్)

మట్టి విత్తనాలు -1

చెట్ల ఆకులు పక్షుల  రెక్కలు ఉదయమే ఒళ్ళు విదిల్చి,ఆవలిస్తాయి అందుకే చెట్టు గాలికి ఊగుతుంది రాత్రి పిట్టలు తిరిగి వచ్చినప్పుడు గడపెదుట వాలుతాయి
అప్పుడు అందరూ కలిసి ఆకాశాన్నితిరగేసి వూపుతారు అందుకే రాత్రవుతుంది అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ పడుకుంటారు
చుట్టు పక్కల ఆవరణలో రెక్కలాకుల మాటలు వెన్నెల గింజల్ని  నాటుతాయి - కధ ముగిసే లోపే పిల్లలు నిద్రలోకి జారుకుంటారు అప్పటికే పిల్లల  కలల్లో కొన్ని బీజాలు  మొలకెత్తుతాయి - పిల్లలు మట్టి రెక్కల  విత్తనాలు
 (27-11-14)