Posts

శ్లోక - ద జర్నీ

  శ్లోక- 1 పయనం శ్లోక ముద్దు ముద్దు పలుకుల వంటకాల   ఘుమఘుమలు బాల్యపు చెమ్మ మనస్సు పెదవి పై ఇంకా మిగిలిన అమ్మ పెట్టిన గోరుముద్ద పలుకు శ్లోక- 2 శ్లోక   చదువు ,సంధ్యల కబుర్లు పిల్ల పంతులమ్మల ముందు సదా విద్యార్ధులమే! శ్లోక- 3 శ్లోక మాటల బాటలో పయనం గమ్యం చేరడానికి కాదు! ప్రయాణ కాలాన్నిగమ్యం  చేస్కోడానికి! ! (కె. శ్లోక కు, 28-2-2021)

మాల్

మా ఇల్లు పిచ్చుకలకు,పక్షులకు అంగడి రోజూ ఉదయమే మొక్కలకి నీళ్ళు పోయడానికి సూర్యకాంతి కోసం కిటికీ,తలుపులు తెరుస్తాను అప్పటికే గూళ్ళుకట్టుకోడానికి, ఇంటికి కావాల్సిన సరుకులు వాటంతట అవే తీసుకేళుతుంటాయి... వాటి కూతల శబ్ధంతో మా ఇంటి గల్లా పెట్టి నిండుతుంది (4-5-2020)

ఏదేమైనప్పటికీ...

రోడ్లని మాత్రం తిన్నగా నిర్మించాం ‘పట్టా ’ లతో బాటు రోడ్లనీ చదువుకున్నాం మీ వూరికి రోడ్డుందా! అని కుశలమడిగాం రోడ్లకి ఓపిక ఎక్కువ కిక్కిరిసిపోయినా కిక్కురుమనవు వేగాన్ని అదుపుచేయడానికి మలుపు తిరుగుతాయి పండగలు పబ్బాలు బైఠక్ లకూ,అన్నిటికీ అడ్డాలవుతాయి ఇల్లు వదిలిన దారిద్ర్యానికి కాళ్ళవుతాయి రోడ్డెమ్మటే చెట్లతో బాటు రోడ్లకి ఇల్లుంటే బాగుండు ఏదో పోగోట్టుకున్నదిలా వుండదు మనని పలకరించే నియాన్ కాంతి   గొట్టం నవ్వుతున్నట్టు౦టుంది ఏదేమైనప్పటికీ... రోడ్లు ఎదిగాయి వలస పక్షుల గూళ్లయ్యాయి చెదిరిపోతున్న సంబంధాలకు ‘సెల్ ’ ఫోన్ లయ్యాయి . ( 98)

కొన్ని హిందీ కవితల అనుసృజన

మబ్బుల చాటునుండి వస్తున్న చంద్రుడు ఎవరినైనా వెతకడానికా,లేక తనని తాను ప్రదర్శించుకోడానికా! ( 6-6-96) - తిరుగుతున్న ఆగిన సైకిల్ పెడల్స్ తాడు లేని బొంగరం ( 7-6-96) - నాల్గు మాటల కోసం నాల్గు గోడలు మనసులోని మాట పెదవుల పై బందీ అయ్యింది - నదిలో వెన్నెల కాగితపు పడవా లేక అందని ప్రేమలేఖా! ( 96)

పూలు - పండ్లు

నేల పైన రాలిన వేప పూలు పసి పిల్లల తప్పటడుగుల ఆనవాళ్ళు (6-4-2020) - నింగిని తూర్పారపడితే రాలిన నక్షత్రాల కాంతి చెట్టు నేల చెంతన కానుగ పూలు ( 8-4-2020) - చెట్టు పై నుండి ఎగిరే పక్షి రెక్కల చప్పుడు నేల పై   రాలిన ఉసిరి కాయలు వాకిలి మువ్వల చెట్టు ( 9-4-2020 ) - దానిమ్మ పాదులోని నీళ్ళల్లో తేలుతున్న మునగ పూలు నింగి గదిలో ఆమె రాక కోసం తచ్చాడుతున్న చంద్రుడు (10-4-2020)

నేను నా గది

సీసాలో అతుక్కు పోయిన చివరి నీటిచుక్కలా ఒంటరిగా బిగుసుకుపోతాయి జ్ఞాపకాలు - గది విడ్కోలప్పుడు వెనుదిరిగిన చూపు తలంపుల మంచం మీద వాలిన ఆలోచనల కళేబరం పైకప్పుకంటుకున్న నేత్ర నక్షత్రం గది దాపరికం లేని తలలోని నాలుక గది అడుగుల గుర్తులంతిల్లు నా మటుకు నాకు గది నా సమాధి మన్ను మీద వాలిన మట్టి ఆకు నా శిలాక్షరం ( 1-8-2016)

పిచ్చుకలు

గూళ్ళలలో మా గుండెల్ని పచ్చగా పొదగడానికి మా బాల్కనిలోని తీగలకున్న ఎండు పుల్లల్ని తీసుకుని పోతాయి ( 3-4-2020)