తుది కలయిక
చివరి కలయికప్పుడు
చెప్పిన మొదటి మాట
ప్రతిరోజూ అందర్నీ కలిసి
స్నేహం చేయాలి
చివరి రోజు కోసం
ప్రతి రాత్రి దీపాలు వెలిగించాలి
చివరి కలయికప్పుడు
సమూహాల్లో కలవద్దు
పొడి పొడి నవ్వుల్ని పులుముకోవద్దు
బంధాలకు వూపిరాడని
ఇనుప కౌగిలింతలొద్దు
చివరి మాటకు పయనముంటుంది
ప్రతీది అర్ధమయ్యేటట్లు చెప్పలేం
అందుకే
చెప్పే పద్ధతిని మార్చుకుందాం
రావాల్సిన
వారు రాకపోతే
వచ్చిన వారి గురించే మాట్లాడుదాం
ఎవరూ, ఎవర్నీ వదిలిపోరు
మనందరి
కనురెప్పలకు
పచ్చటి కాటుకద్దాలి
విడిపోయే ముందు
దానిని పచ్చ బొట్టుగా పెట్టుకుందాం
ఇది నా చివరాఖరి మాట
సూర్యుడు నా గదిలో అస్తమిస్తాడు
రేపు చీకటిని తొలుచుకుంటూ వస్తా
కలిసే సమయం, స్ధలం మార్చేస్తా
దేహ ధూప కాంతి పరిమళాన్ని
మీ ముని వాకిలిలోని తులసి మొక్క కుండీకి
ఎరుపు ,పసుపు బొట్టులా ...
( జనవరి-98, నా పాత హిందీ కవితకు
అనుసృజన -13-4-2020)
Comments
Post a Comment