Posts

Showing posts from October, 2012

ప్రతిబింబం (సీక్వెల్)

పక్షులు ముక్కున తీసుకున్న గరిక పరకల్లా నేను రోజూ కొన్ని అక్షరాల్ని ఏరుకుంటా ఇంటిని అక్షర మాలగా కూర్చాలని ప్రయత్నం చేస్తుంటా వాటి కాలం వేరు పరిణతి చెందినవి నా  మటుకు తరచు చేయాల్సిందే అందుకే పెరటి నిండా మొక్కలే ఇంట్లో కూడా అవి ఇంటి సభ్యులవ్వాలని మా యత్నం సదా కొనసాగే అలవాటుగా మారాలని ఎప్పటికైనా ఇల్లుని కవిత్వ పొదరిల్లుగా అమర్చాలని. రోజూ ఉదయం పిట్టలు బయటకు వెళ్ళే ముందు కిటికీ తట్టి మరీ గుర్తు చేస్తాయి లోనా బయటా నేల చీరని పచ్చగా అమర్చమని గూళ్ళని కళ్ళలో పెట్టుకుని చూడమని

ప్రతిబింబం

రోజూ  ఉదయం కిటికీ తట్టే పిట్ట నా మొహాన్ని  ఎగరేసుకు పోతుంది మా ఇద్దరి గూళ్ళూ కళ్ళ  అద్దాల్లోనే

తిరుగు ప్రయాణం

Image
నదిలోకి  సూరీడు తడిసిన పాపిడి కుంకుమ  నే  నెలవంకలా మలుపు తిరిగా (శ్రీకాకుళం,కృష్ణా జిల్లా,26-10-12)

సరిహద్దు

నా ఎడారి చూపు అంతరంగాల్లోని శూన్యపు పయనం తన రెక్కల రంగుల అంబులపొదిలో పరమపదిస్తున్న సీతాకోకచిలుక

ఏకాంతం

Image
గోధూళి వేళ నది నిష్క్రమించిన పడవ అల నిద్రెరుగని మత్స్యకన్ను

ధ్యానులు

ఇంధ్ర ధనుస్సు వాళ్ళ కళ్ళల్లో కాటుకద్దుకుంటుంది ఆలోచన వేగంతో నడిచే ప్రవక్తలు

చినుకులోన

పెదవుల రేఖ నుండి జారిన బొట్టు కొండల నడుమ కొత్త యేరు నా  దప్పిక వాగు నిండింది ఆమె  వాల్చిన కనురెక్కల  మబ్బు తునక గుటకలా...

వెలుగు అల

నక్షత్ర బీజం నాలో అంకురించింది మబ్బు ఆత్మ ఆవహించినట్టు ఈ నేలనంతా అల్లకుపోతా... పచ్చటి పుడమి మీద కాంతి రేఖలా... భూమి సదా ఎదగాలన్న వాంఛతో.