Posts

Showing posts from January, 2013

దీపస్తంభాల ఆనవాళ్ళు

వేలి చివర్నంటుకున్న చంద్రుడు వెనకాలే కొండ చాటున రాలిన సూరీడు బాల్కనీ నుండి లోనికి వచ్చి లైట్ వేశా వీధి దీపం కూడా వెలిగింది పూర్వం వీధి దీపాలు వెలిగించే వాళ్ళ ఙ్ఞాపకాల కాలం గుర్తొచ్చింది కిటికీ మూయడానికి వెళ్ళా చీకటిలో కనిపించని సంపెంగ పరిమళం గదిలోకి సోకింది కిటికీ అద్దంలో ట్యూబ్ లైట్ ప్రతిబింబం వెలుగు పంచే గుణం సాక్షాత్కరించినట్టు  తన్మయంతో మనసు మోకరిల్లింది కనురెప్ప కనుపాపని ముద్దాడింది (23-1-13)

బంతి పూల భిక్షువు

బంతి పూలు రంగుల వర్షపు చుక్కలు వాటి పరిమళం ఆమె వోర కంటి పెదవులొడ్డున వూగిసలాడె చిరుహాసం మంచుపొరల్లోని క్రీగంటి చూపుల నెగళ్ళ సెగలా అక్కడే సంచరించే ప్రార్థనాలాపన భిక్షువుని ... అనుగ్రహం వాడినబంతి రెక్క రాలి పుడమి వాకిళ్ళకి పారాణి అద్దింది ... బంతిళ్ళు అరచేతులకంటిన నేలసిగ పూలధూళి ముద్రలోని కాంతి రేఖలు భిక్షువుల ధ్యాన మందిరం సడి చేయని మంచు బిందువుల మౌన గుహ (16-1-13,మాధవికి, మా బంతి తోటకి)

ఫెంచ్ (గాలి పటాల పోరు)

కరెంటు తీగలకు వేలాడుతున్న గాలి పటంలా ఈ రోజు నెలవంక నా కనుగుడ్డు కొసనే  వుంది మనస్సు దారంతో చిక్కడిన పండగ చివర్న మిగిలిన పతంగిలా నా గూట్లోనే ఆకాశ మార్గాన్ని దుప్పట్లో పొదిగిన కలలా ఒదిగిపోతుంది ఈ ఏడాది మా వాడు పండగకి వూరెళ్ళాడు గాలి పటాన్ని గదిలో వదిలి ఇంట్లో  నేనూ మాధవి తెగిన గాలి పటాల దారంలా  నేలకి ముడిపడి నింగిని కళ్ళలో ఎగరేసుకుంటూ... (15-1-13)

ప్రసవం

కాలం  గడియారం ముల్లు ఊయ్యాలలో కోరిక తీరని ఆత్మలా పరిభ్రమిస్తుంది నా మటుకు నేను  దాని ఘడియల్ని రోమన్ లేక ఆంగ్ల అంకెల్లో లెక్కిస్తూ నా రాత వయస్సుకి కాలం చిగురించదు  మోడు వారదు బహుశా కాలాన్ని లెక్కించే మారిన యంత్రాల  సూదుల వాడికి  నా రక్తం రుచించదేమో! ఒక్కప్పుడు ముచ్చట్లతో కాలం స్తంభిచేది ఇప్పుడు నా కాలం నా అవయవాల ఆవరణలోనే బందీ అయ్యింది ఇకపై ప్రతి వారం చివర్న నలుగుర్ని కల్సి కాలక్షేపం  చేస్తా వీలైతే ఆ చావడికి మీరూ రండి కొద్ది సమయాలు పురుడు పోసుకుంటాయి (2-1-13)

జాబిల్లి

ఆకుల మాటున చందమామ పచ్చని కాటుక రెప్పలో కనుపాప (1-1-13)

గూళ్ళ రెక్కలు

ఒకే గూడుకి రెండు అరలు కిందది గిజి గాడికి పైది గిజికి సహవాస గాలికి ఊగే ఉయల పందిరి. నేల రాలిన చుక్క బావి పైన తుమ్మ కొమ్మలకి అంటిపెట్టుకున్న గూళ్ళ వూరు పుడమి తివాచిని ఎగరేసుకుపోతున్న రెక్కల్లా. మూనిమాపు వేళ చెట్టు ఓ సంధ్యారాగం అప్పుడే వచ్చివాలే తెల్ల కొంగలు ప్రేక్షకులు తుమ్మ ముల్లు పక్షికూతలు రేయింబవళ్ళని జతకలిపి పలికించే బాన్సురి వయలీన్ల జుగల్ బంది (29-12-12,కంసానిపల్లి,మహబూబ్ నగర్ జిల్లా)