Posts

హనీ డ్రాప్స్

నక్షత్రాలు ఆకాశంలోని చివరి మిణుగుర్లు సీసాతో కబుర్లు చెప్పుకుంటా నాలోని జీని తారతో మంత్ర తివాచిపై విహరిస్తా ఉదయం  చివర్లో సెలవుతీసుకున్న జీవాత్మలా జేబులోనుండి జారిన  దుడ్లన్నీ దుప్పటికంటుకుని...  నిప్పులోని ఈల పాట  మళ్ళి రాత్రికి చుక్కల్ని తెచ్చిస్తుంది!  ప్రతి రోజూ బొతల్ సముద్రంలో తేలి నాకు చేరాల్సిందే నేను నింగి ఒడ్డున నీటి ఘోస్టికి గేలం వేసే  జాలర్నే 6-2-13 (చాలా కాలం తర్వాత ,గుల్జార్ ,బొతల్సె ఏక్ బాత్ చలి హై పాట ఙ్ఞాపకం వచ్చి)

అభివృద్ధి మైనింగ్

చదరంగ పావుల్ని కదపడం నేర్చుకోవాలి ప్రత్యర్ధి పావుల్ని నడిపే వ్యూహాన్ని పసిగట్టాలి అతడి ఆలోచనల్ని నెమరేయాలి రెండు మెదళ్ళ మధ్యనున్న చదరంగ బోర్డులో ఉహాచిత్ర పావులకి జీవం పోయాలి నిర్జీవం చేయాలి ఎక్కడా రక్తపాతం వుండదు వాటి మరకలూ కనిపించవు యుద్ధమంతా నలుపు తెలుపు గడుల్లో తొక్కుడు బిళ్ళాట కిటికు ఒక్కటే ఆడేవాళ్ళు మధ్యలో యాం ఐ ఔట్ అని అడగాలి ఇంతలో టైం విల్ రన్ ఔట్ టిక్   టిక్  టిక్ భూవేర్లనంటిపెట్టుకున్న ఖనిజాన్ని పెకలించే అధునాతన యంత్రాలు దూసుకుపోతాయి అంతరిక్షం లోనూ గుండెల్లోనూ... అగుపించని ప్రత్యర్ధి నీలోనూ నాలోనూ పబ్లిక్ హియరింగ్ లోనూ టిక్  టిక్  టిక్... 7-2-13

నిద్రించని చెట్టు

రాత్రప్పుడు చెట్ల కింద పడుకోవద్దన్న నమ్మకం వుంది అవి మీద పడతాయట నగరంలో నిద్రలేమి సాలె పురుగు గూట్లో కంటే శిశిరంలో పోడప్పుడు చేను మకాంలో నక్షత్రాలని లెక్కెడుతూ మిణుగుర్లని విత్తుతూ వుండిపోయా ఛెట్టు రాలలేదు కానీ అడవికి వెలుగునిచ్చే మోదుగ పూచింది వసంతానికి నాంది గా  చుక్క రాలి రెల్లు గుత్తు పొడిచింది రాత్రప్పుడే చెట్టు అకాశంలో ఆకుల నక్షత్ర గుచ్ఛం అవి పువ్వులై రాలుతాయి వాటి చెంతనే నిద్రిస్తా ఆకుల్లోని సవ్వడి చేయని మంచు తేనె తీర్థాన్ని చివరాఖరివరకు ఆ తర్వాత ఆస్వాదిస్తా పోడు భూమిలో గింజకి కావలి కంచయిన  చెట్టు సదా పంటనిచ్చే కొత్త పండుగ! (30-10-13)

క్షీణత

కనుచూపుమేరంత వుండే విశాలమైన స్థలం నేల చీర వివిధ రంగుల్లో ఫ్రశాంతతని పరిచినట్టు నది ఒడ్డున చాకిరేవులోని రంగుల బట్టల్లా నింగి నేల నీటి ప్రదేశాలు ఇప్పుడంతా ఖాళీతనాన్ని కోల్పోయిన పుడమి కోరిక రెక్కలు ఎగరలేని ఇరుకుతనం కంట్లోకట్టుకున్న గోడల్లో  సమాధైన మనస్సు చూపు  బొంద మీద మట్టిలా (24-1-13)

దీపస్తంభాల ఆనవాళ్ళు

వేలి చివర్నంటుకున్న చంద్రుడు వెనకాలే కొండ చాటున రాలిన సూరీడు బాల్కనీ నుండి లోనికి వచ్చి లైట్ వేశా వీధి దీపం కూడా వెలిగింది పూర్వం వీధి దీపాలు వెలిగించే వాళ్ళ ఙ్ఞాపకాల కాలం గుర్తొచ్చింది కిటికీ మూయడానికి వెళ్ళా చీకటిలో కనిపించని సంపెంగ పరిమళం గదిలోకి సోకింది కిటికీ అద్దంలో ట్యూబ్ లైట్ ప్రతిబింబం వెలుగు పంచే గుణం సాక్షాత్కరించినట్టు  తన్మయంతో మనసు మోకరిల్లింది కనురెప్ప కనుపాపని ముద్దాడింది (23-1-13)

బంతి పూల భిక్షువు

బంతి పూలు రంగుల వర్షపు చుక్కలు వాటి పరిమళం ఆమె వోర కంటి పెదవులొడ్డున వూగిసలాడె చిరుహాసం మంచుపొరల్లోని క్రీగంటి చూపుల నెగళ్ళ సెగలా అక్కడే సంచరించే ప్రార్థనాలాపన భిక్షువుని ... అనుగ్రహం వాడినబంతి రెక్క రాలి పుడమి వాకిళ్ళకి పారాణి అద్దింది ... బంతిళ్ళు అరచేతులకంటిన నేలసిగ పూలధూళి ముద్రలోని కాంతి రేఖలు భిక్షువుల ధ్యాన మందిరం సడి చేయని మంచు బిందువుల మౌన గుహ (16-1-13,మాధవికి, మా బంతి తోటకి)

ఫెంచ్ (గాలి పటాల పోరు)

కరెంటు తీగలకు వేలాడుతున్న గాలి పటంలా ఈ రోజు నెలవంక నా కనుగుడ్డు కొసనే  వుంది మనస్సు దారంతో చిక్కడిన పండగ చివర్న మిగిలిన పతంగిలా నా గూట్లోనే ఆకాశ మార్గాన్ని దుప్పట్లో పొదిగిన కలలా ఒదిగిపోతుంది ఈ ఏడాది మా వాడు పండగకి వూరెళ్ళాడు గాలి పటాన్ని గదిలో వదిలి ఇంట్లో  నేనూ మాధవి తెగిన గాలి పటాల దారంలా  నేలకి ముడిపడి నింగిని కళ్ళలో ఎగరేసుకుంటూ... (15-1-13)