Posts

Showing posts from June, 2013

సోనే కీ ఆవాస్

పసి గొంతునుండి వస్తున్న కిస్ మోడ్ సే ఆయే హైన్   పాట... తన్మయత్వంతో మూసుకున్న  కళ్ళు కళ్ళు తెరిచింతర్వాత తెల్సింది కళ్ళకి అద్దాలున్నాయని ఆ గొంతు ఏ దిశగా వచ్చిందో... ప్రేమ లోని ఎడబాటుతనానికి పసితనపు  తడి అద్ది వెళ్ళింది  పిల్లల గొంతులు ప్రేమ జాడలన్నీ కలిపే  తెలుపు కూడళ్ళు తెరిచిన తర్వాత కళ్ళలో... అద్దాల్లో అరచేతి పాలెట్లో మనసు రంగుల్ని కలుపుతూ   చిన్నారి గొంతుని స్మరిస్తూ పాట మ్యూరల్ని చిత్రిస్తూ ఇలా... కిస్ మోడ్ సే ఆయే హైన్, కిస్ మోడ్ సే జాయేంగే... (సోనాక్షి ఖేర్ కి) (2-6-13)

పచ్చటి ధనం

కొన్నిళ్ళలోకి వెళ్ళగానే ముందుగా గేట్ తెరవాలి చాలా కొన్నిట్లోకి మట్కు పచ్చదనపు హరివిల్లులనుండి లోనికి వెళ్ళాలి వచ్చేసిన తర్వాత పచ్చటి వెలుగు ఙ్ఞాపకాలు వెంటాడుతూనే వుంటాయి ఆ ఇంట్లో వాళ్ళకి మటుకు ఇల్లొదిలి  వెళ్తే ఇంట్లోని వస్తువులమీద బెంగ కంటే ఇంట్లోని జీవాల మీద దిగులెక్కువ ఇళ్ళు జీవమున్న  మట్టి పుట్ట గొడుగులు (వంశి,దాక్షాయని గార్కి,వారి ఇంటికి మా ఇంటికి వున్న  సహచర్యానికి) (18-6-13)

లిపి లేని భాష

నేల భాష పలుకులన్నీ... వేరు కంటిన మట్టి  నుండి  మొలకెత్తే పచ్చటి తడి  మట్టి పుట్ట  ఉమ్మనీటి వాగులు ఆ పొరల కళ్ళజోడుతో ఆకాశాన్ని చూద్దాం  నింగి లోని రంధ్రానికి మట్టి బొట్టు పచ్చటి కవచమవుతుంది మబ్బు నీడ గిరికి గొడుగవుతుందన్న అంతరిస్తున్న లిపిలేని మాట మట్టి పలక మీద ఆకాశ వాణవుతుంది (24-5-13)

మోదుగ పూల చెట్టు

నేల రాలిన పూలు  నింగి  నుండి  జారిన  సూరీడు  ఈ  రాత్రి  చెట్టు కింద  నిద్రోతా   పున్నమి వెన్నెల   నిలువునా  దహించి  వేస్తుంది  పగలు  ఆకాశం నా దేహ కాంక్ష   రంగుని   పులుముకుంటుంది  మట్టి మంచం  ఇంకా  రగుల్తూనే   వుంటుంది  (3-4-13) 

శిశిరం

గాలి  రాలే ఆకులతో గీతమైంది నా ప్రియురాలి కౌగలింత ఘటం పై నృత్యించే వేళ్ళు నేను అడవికి ఇసుకతిన్నెల  గుసగుసల చిహ్నాన్నయ్యాను 7-2-13