Posts

Showing posts from October, 2013

ఎదురు చూపు

తీగల పైన తడిసిన కాకి వరదలప్పుడు వర్షం కనురెప్పలనుండి దూకుతున్న చుక్కలు వదిలివెళ్ళిన చూపు గూట్లొకి వచ్చెదెప్పుడు! (25-10-13)

చర్కా

రోజూ ముడులిప్పాననుకుంటూ కొన్ని చిక్కుముడులేసుకుంటున్నా గాలి పటాన్ని ఎగరేయడం కాదు రావల్సింది దింపుతున్నప్పుడు గాలిదారపుండని చుట్టడం నేర్చుకోవాలి (6-813)

వుండీలేనట్లుండడం

Image
నేలగాలిని పులుముకుని తచ్చాడే శ్వాస ఉదయం,సాయంత్రం ఝాములు ఓ పరిమళపు నీడ గుమ్మం గడపలా... (16-9-13)

మొలక

Image
మొక్కల చూపులు మాటలు నాతో నన్నే మాట్లాడేటట్లు చేస్తాయి ఇక ఓపికలేక ఆకాశంవైపు చూసాను సూర్యుడి లాంతరులో చంద్రుడు పొడుస్తున్నాడు (నా ఏకాంతాన్ని పంచుకునే ఇంట్లోని మొక్కలకి) (10-9-13)

ఉనికి

శరీరమంతా దహనమైన తర్వాత పుచ్చపగిలిన  పటేల్ మన్న చప్పుడు భూమి శిధిలాలగొంతులోని మాట కాలిన బొగ్గు రక్తంలా చెవిలో శీసం లా మారు మారు మారు  పదే మారు ఊగిసలాడే గంటల చప్పుడులా మోగుతున్నప్పుడు బొడ్డునుండి తెగిన నేత్రంతో శూన్యావిర్భావాన్ని చూస్తూ అమ్మా! అన్న మాట కడుపులోనుండి ఉబికి ఉబికి  ఉబికి ఛస్తూ ఛస్తూ ఛస్తూ వస్తూ వస్తూ వస్తూ చచ్చినట్టొస్తూ... కళ్ళలో పొరలు పొరలు పొరలుగా.... ఇంకుతునప్పుడు అయిన ఙ్ఞాన ఉదయం భూమిని రేప్ చేస్తే  సూర్యుడు పుడుతున్నాడని రోజంతా  పరిమళంలేని పూల మధ్య తిరిగే  కాటికాపరని మళ్ళీ వెన్నెల బూడిదని  నుదుట రాస్కుని మట్టిలోకి నిష్క్రమించే ఎండిన చెట్టు  వేరు కణమని! ----- ఇక ఇక్కడే మౌన ముద్రలో ఎదురు చూస్తూనే వుంటాను చిట్లిన నేలలొని కూట్లనుండి వర్షపుజల్లు చుక్కలా పచ్చటి ఉషోదయం నా నాలుక పై రాలేంత వరకు (24-9-13)