మేము,చిత్రిత కొంగ ,ప్రొక్లైనర్



మా ఇంటి వెనుక మైదానంలో
కొంత కాలం క్రితం ఆమె, నేను నాటిన మామిడి,చిన్న వుసిరి, సీతాఫలం ,సపోటా,జామ, నేరేడు, మునగ ,చింత,నిమ్మ, గుల్మొహర్ , వేప మొక్కలు ..
హరిత హారంలో భాగంగా  నాటిన కానుగ,రావి మొక్కలు...
భారతి ఆంటీ నాటించిన మారేడు, వెలగ మొక్కలు...
సుమారు 20 చెట్లు.....
కొన్ని పూతకొచ్చాయి
ఆ చెట్లిప్పుడు చాలా రకాల పక్షుల నివాస ప్రాంతాలు
 ప్రాంతాన్ని పిల్లలు ఆడుకోడానికి అనువుగా ప్రొక్లైనర్ తో చదును చేయిస్తున్నారు
యంత్రం నేలను చదును చేస్తునప్పుడు చెట్లకు ఇబ్బంది కలిగి అవి పెకలించబడతాయన్న శ్రద్ధతో కూడుకున్న భయంతో  కావలి కూర్చున్నా...
 వాటికి నీళ్ళు పోసి, ఆమె ,నేను వాట్ని పిల్లల్లా పెంచాము
---------
ఎక్కడినుండో వచ్చింది ఒక చిత్రిత కొంగ !
యంత్రంతో బాటు భయంలేకుండా దాని  చుట్టూనే తిరుగుతోంది.ట్రాఫిక్లో బాగా తిరిగే అలవాటున్న ప్రాణంలా .
సన్నిహితుడితో నగర రోడ్డుల్లో ఇష్టానుసారంగా  తిరిగినట్టు వుంది దాని స్వభావం.  ఒకప్పుడు పశువుల పైన వాలి తిరిగే సహజీవన వాసి అది. చిన్నపాటి అలికిడికి పశువులు తమ తోకాడించేవి. ఆ సౌ౦జ్ఞకు కొంగ పశువుల నుండి దూరంగా ఎగిరి వాలి, వాట్ని గమనించి మళ్ళీ వచ్చి వాలేది. ఆ అలవాటు ఇప్పటికీ  దానిలో కనపడుతోంది. అది యంతాన్ని పశువుగా ఎందుకు అనుకుని, అలా యంత్రాన్ని వదలకుండా తిరుగుతుందో  కొద్దిసేపటికి అర్ధమయ్యింది.  పెకలించిన మట్టిని కుప్పగా వేస్తునప్పుడల్లా ,అది ఒక్క ఉదుటున ఎగిరి కుప్ప మీద వాలి వాన పాముల్ని,క్రిముల్ని  పట్టుకుని తింటోంది. ఏదో పాత పుస్తకంలోని అక్షరాల్ని ఆస్వాదిస్తునట్టు !
పశువులు లేని కాలంలో యంత్ర స్వభావం దానికి అర్ధమైనంతగా  మనకు అర్ధం కాదు.
ప్రొక్లైనర్లను, బుల్డోజర్లను మనం, మట్టిని,మట్టివాసుల్ని, నివాసాల్ని పెకిలించాడానికే ఎక్కువగా ఉపయోగించే యంత్రతంత్రులం. అది మటుకు యంత్రానికి కొద్దిపాటి మట్టి చూపుని కలిగిస్తోందనిపించింది.
.........
మర్నాడు  మళ్ళీ  మిగిలిన పని ముగించడానికి  ప్రొక్లైనర్ వచ్చింది ,నేను వెళ్ళాను ,కాని చిత్రిత కొంగ రాలేదు.తను ,నేను,అందరం నాటిన మొక్కలు  ఇంకా పెద్ద చెట్లైనప్పుడు,దాని సంతతి  వాలుతుందన్న ఆశతో దాన్ని తలుచుకుంటూ కూర్చున్నా ...
ఆవుల,గేదెల మందను కాసే పిల్లలు, నింగి విహంగాలుగా గేదెలపై ఎక్కి రాజ్యాల్ని హస్తగతం చేస్కుంటునట్టు పశువుల్ని కాసేవారు,నేల పైన పిల్లల్లా  చిత్రిత కొంగలు వాటి వెంటే నేల పైన తచ్చాడేవి.
పచ్చటి నేల తివాచీ పై స్వచ్ఛమైన తెల్లటి మబ్బు మన్ను పర్చుకునట్టు...
యాంత్రిక యుగం లోని రాతి కాలంలో,ఆ జీవన దృశ్యాలు ,పిల్లలకు ఆటస్ధలాలు కనుమరుగయ్యాయి ...
పిల్లల ఆటపాటడుగులు లేని  నేల, వేరులేని మట్టే ! చినుకు లేని నేల రోదన !!
------
అక్కడే వున్నా .....
ప్రొక్లైనర్ నడిపే రిజ్వాన్ని అడిగా ఎక్కడి నుంచి వచ్చావని, “డిల్లీ దగ్గర ఉంటా సార్, రెండు  నుండి నాల్గు  నెలలు వచ్చి ఈ పని చేస్తా, మాములుగా  అయితే చలి కాలంలో వస్తా, కానీ ఇప్పుడు వేసవిలో వచ్చా . అక్కడ వ్యవసాయం చేస్తా! “ మట్టివాసన తెల్సిన మరో కొంగ కాబట్టి మొక్కలకి ఇబ్బంది కలగ కుండా ,విసుక్కోకుండా శ్రద్ధగా పనిచేశాడు.
ఇంతలో   పిల్లలు అంకుల్ ఇది “వాలీ బాల్ కోర్టా”    అయితే  మేము వచ్చి ఆడుతాం అంటూ కట్టమీద నడుచుకుoటూ వెళ్ళి పోతున్నారు,అవును ,నా కొడుకు  వాడి స్నేహితులతో ఒకప్పడు ఆడుకునేవాడిక్కడ !
నీ కోసం ... పిల్లల కోసం...ఇప్పుడు కూర్చున్నాను.
కానుగ, వేప,మామిడి ,నేరేడు,సపోటా  చిగురించాయి, గుల్మొహర్ ఎర్రటి పూలు మొదలయ్యే కాలం.
పని ముగిసే సమయానికి వాలింది చిత్రిత కొంగ. పని ముగిసేంత వరకు వుండి వెళుతూ, వెళుతూ,   నా వైపు వీడ్కోలు చూపు విసిరి  ఎగిరిపోయింది.  
దాని కనుపాప దృశ్యం    నాకు చెప్పిందల్లా... మట్టంటని పసిపాదాలకు తల్లి గర్భమే ఆట స్ధలంగా మిగిలిందని ,కూసింత మట్టిని వాళ్ళకి పచ్చటి మైదానంగా  పెంచి, వేయి ఋతువుల రంగులతో అల్లుకున్న క్రీడా స్ధలంగా ఇవ్వడమే  మనం చేసే  సహజమైన మట్టి వేర్ల   జపమని !
 (లిబ్రా ఎన్ క్లేవ్ పార్క్, బడంగ్ పేట, 25-3-2016)
--- జి. సత్య శ్రీనివాస్


Comments

  1. అభినందనలు, సర్..మీరచనలు చదవడం, మొదటి సారి నాకు.బాగరాశారు.!💐

    ReplyDelete
  2. మట్టి సువాసన 💖

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

పిల్లల చెట్టు

గూళ్ళ రెక్కలు