అవును
కొందరు నిష్క్రమించినా
ఇంకా వున్నట్టుగానే
స్మరించుకుంటాం
గాలి వీచినప్పుడు
మర్రి కొమ్మ ఆకులు
రెపరెప లాడుతుంటే
కోయిల
వీడ్కోలు ,కలయికలని
ఒకే స్వర పేటికలో
పాడినట్టు
మర్చిపోయిన పెద్ద బాలశిక్ష పుస్తకంలో
నానేసిన బీజాక్షరాలు
మొలకెత్తుతున్నట్టు
అవును
వాళ్ళ మట్టి మీద
మన తడి అరికాలి
రేఖలు
ఇంకుతున్నట్టు
సమాధి పైన
కాలాన్ని
చెక్కినట్టు
అవును
వాళ్ళు
నిష్క్రమించినా
ఇంకా వున్నట్టుగానే
స్మరించుకుందాం!
మనం
ఇక్కడ ఇలా
కొంతసేపు
ఇంకొద్ది సేపు
వుండిపోదాం.
చివరి మజిలీ
వాటికలో
మళ్ళీ
ఇంకెవరో
మరెవరినో
స్మరించుకునేoదుకు
వచ్చే లోపు
లేలేత పచ్చిక మీద
మంచు బిందువుల
ఉయ్యాలలో
మన వూసల ఘడియల
ప్రతి బింబాలు
పూసినట్టు.
ప్చ్...
కొంతసేపు
ఇంకొద్ది సేపు
ఇక్కడే గడిపేద్దాం
అవును
ఆకులు రాలే కాలంలో
లోలోపల అరుణం
మోదుగ పూల గుచ్చంలా
సంభాషించుకుందాం
(22-2-2016)
( నా కిష్టమైన కొన్ని మిగిలివున్న పచ్చని చివరి మజిలీ
వాటికలకి,అందులోని ఆప్తులందరికీ)
Comments
Post a Comment