మాటలు లేని పక్షి
ఒకప్పుడు
సముద్రపు ఒంతెన పైన కోరికల కంచె కట్టాను
అల
ఓ తాళం కప్ప
ఒడ్డు
ఎవరో జ్ఞాపకాల దీపం
రేవెమ్మటే ఎవరెవరివో
తడిపాద ముద్రలు
రెప్పపాటు కాలంలో
అలరెక్కల్లో రంగులై
పోతాయి
నేను
లైట్ హౌజ్
అందరూ ఇళ్ళు చేరే
సమయానికి
కొంత వెలుగల్లుకుని
కూర్చుంటాం
దూరంగా
ఇంకా సేద తీరని
వయస్సులా
పడక కుర్చీలోని
చూపొకటి
వాటితో పాటు
కొన్ని డచ్ సమాధులు
మా చెవుల్లో
గుసగుసలాడుతాయి
ఇసుక రెక్కల
గూళ్ళల్లో
తాబేళ్ళు
నడిరాత్రిలో రాలిన
నక్ష త్రపు కాంతి గుడ్లు పొదిగి వెళతాయి
మర్నాడు
సూరీడు
లైట్ హౌజ్ కిటికీ
లో నుండి
మా విధిలోకి
చేరతాడు.
బహుశా ఇప్పుడు
చిరిగిన తెరచాప పడవొడ్డులా
పడక కుర్చీలో
అనవాలులేని సీగల్
చలనం లేని తెడ్డులా
మర్రిమాను ఊడ
ఉదయ సంధ్యల
ఎర్రమట్టి దిబ్బల
రంగులస్తికల్ని
సముద్రంలో కలిపేస్తున్న
కుబుసంలా
సూరీడు
( ఎప్పటివో భీమిలి సంద్రపు ఒడ్డెమ్మటి పాత ఇళ్ళు 1992-94, ఇప్పుడు జ్ఞాపకం
వచ్చి)
(9-2-2016)
Comments
Post a Comment