కాకి మట్టి



యిక
కొన్ని వర్షపుచుక్కల్ని దాచి పెట్టుకుంటాను,అవి పాత విత్తనాలే!.ప్రతి ఏడాది పూల మొక్కల విత్తనాలతో బాటు వాట్ని గొప్పి తవ్వి నాటమంటాను.మా కొండ పోడు  గూటిలొ రాత్రిపూట వెదురు పొదలనుండి వీచే గాలి మిట్ట  మధ్యాహ్నం జముడు కాకి దిష్టి బొమ్మలా కూస్తుంది. ఉదయం  కుబుసం  వదులుతూ తన నలుపు రంగులోకి వచ్చేస్తుంది. రంగులన్నీ వర్షపు చుక్కల్లా  మట్టి కంటి గూడులో నిద్రిస్తాయి.

యిక
నేల
నీటి కోసం
ఎదురు చూడదు.

కూతపాటి దూరంలో
మళ్ళి రెండు ప్రాంతాల విభజనకు మూల  వాసుల ఊర్లూ విభజన  గీతను  గీసే చేతి కర్రలయ్యాయి.

ఎప్పటి లానే కొండచుగూటిలోని నీటి ఖనిజంగా చేతికర్ర  ఒదిగే వుంది.
దూరంగా ...

నదిఒడ్డున నగారాల నిర్మాణం విస్తరిస్తోంది. చిన్న రాజధాని పెద్దదవుతోంది.
వందల ఏళ్ల  చరిత్ర గల నగరాల్లానే ,నదులూ ఎండిపోతాయి. నది ఒడ్డున మోడు చెట్టునుండి రాలుతున్న ఆకుల్లా వలసపక్షుల  గుడారాలూ  వెలుస్తాయి.

చెట్టుకి నేల లేదు,

నేలకి నీటి చుక్క లేదు,

నగర నిర్మాణానికి మట్టి లేదు.

భూమంతా కొందరి గుప్పిట్లోనే బందీ.

భూమిప్పుడు బంగారూ గుడ్డు పెట్టే బాతు. 
భూమి హస్తగతం చేసుకొనేందుకు  భూసేకరణ ఓ ఆయుధం. ఆయుధం తిప్పే మడమలా  భూసేకరణ లో  సవరణలూ.షరా మాములే!

ఎప్పుడూ భూపంపిణి లో నిరుపేదకి అందిన మట్టి ఓ  తనఖా పత్రం.

నేలని నముకున్న పాదాలకంటిన మట్టి వలసపోయింది .అందుకే వర్షపు తడి పాదాల గుర్తులు గడపచేరవు.

గూటికి చేరని కాకి అరుదైన కబురంపింది  ,

ఇక మిగిలిన  మబ్బు వర్షం లా కురిస్తే ,కొన్ని చుక్కల్ని నాలిక అంచున పొదిగి పెట్టమని!, తొలకరి తడి జల్లులకు మట్టి గంధం సోకదంట.

మనసిప్పుడ్డు ఓ పునరావాశ  పునరుద్దరణ కేంద్రమట.

ముందు  తరాలని

మట్టి ఖననం తర్వాత  రోదనలో
కనురెప్పల వేర్లలో
తడిచుక్క

కాకెంగిలి దిష్టి బొమ్మలా సంరక్షిస్తుందట
 (20-8-14)

Comments

Post a Comment

Popular posts from this blog

పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

సరిహద్దు