ఎండుటాకుల మది

ఒక్కోసారి 
మనస్సు కాలం
అర్ధరాత్రిలోని ఆసుపత్రి గది

కంటి చికిత్స తర్వాతో
గుండె పోటు తర్వాతో
ఆద మర్చి పడుకున్న
తల్లికో, తండ్రికో
తోడుగా
మేలుకున్న క్షణం

కిటికి బయటున్న 
చింతమానుతో మాట్లాడుకున్న ఘడియలు

బయటకు వచ్చి
పెదవులపై తగలెట్టిన కాష్ఠం
పొగలు పొగలుగా
వైతరణిలో
అస్తికలు  ప్రవహించిన ఆనవాళ్ళు


ఇప్పుడు 
అటువైపుగా వెళుతున్నప్పుడు
కొద్దిసేపు ఆగి చూస్తాను
మానులు లేని ఆ ప్రదేశాన్ని


టీ పొగలు లేని
శూన్యపు ఉదయాన్ని


తల్లిదండ్రుల
మనోవేదన గీతాన్ని వింటూ

భార్యాపిల్లాడిని
తలుచుకుంటూ

రంగు కాగితం లేని
జేబులగుండా గుండెని తడుముకుంటూ

చింతాకుల వర్షం లో
తడిసిపొతు

ఎండుటాకుల  మదిలో
పాదముద్రలు లేని  అడుగుల
సవ్వడిలా 
ఛివరొక్కసారిగా
కదిలిపోతాను


(28-2-14)

Comments

Popular posts from this blog

మేము,చిత్రిత కొంగ ,ప్రొక్లైనర్

సమాధి ఫలకం మీద అక్షరం

కిటికి ఆవలి జంబో నేరేడు