కపోత గీతం
కొన్ని పురాతన
ప్రార్ధనా స్థలాలు
శిధిలాలైపోతాయి
-------
మస్జిద్లో ప్రార్ధన ముందు
దోసిట్లోని నీళ్ళలో
మస్జిద్ శిఖరం ప్రతిబింబం
నా ముఖకవళికలకి రూపమిస్తుంది
నేల పైన పావురాళ్ళు
నా తో బాటే
నమాజ్ని ఆలాపిస్తాయి
మెట్ల మీద సదా వుండో
కొన్ని వృద్ధ కపోతాలు
నిర్మానుష్య ప్రదేశంలో
మట్టిలోని జీవంలా
శాంతి పేర్న వాట్ని
మస్తిష్కంలో బంధించి
ఎగరెయొద్దు
కొన్ని గీతాల
ప్రతిధ్వని
గాలికి పరిమళపు
మంచు బిందువుల హారంగానే అల్లుకుంటుంది
ప్రార్ధనాంతరం
మంచులో తడిసిన అరచేతులతో
మొహాన్ని అద్దుకుందాం
చీకటి పొరలు తొలగిస్తూ
ఉదయం
గుండె గంటల చప్పుడులా
మేలుకొలుపు ప్రవచనవుతుంది
ఓ బీజం
దైవత్వంలా
శిధిలాల గోడల్లో
మొలకెత్తుతుంది
వాటి చిగురాకుల పైన
నీరెండ వెలుగు
వెన్నంటే వుండే కవచం
(బడి మస్జిద్,హయత్ నగర్,ఙ్ణాపకార్ధం)
(22-11-13/5-1-14)
Comments
Post a Comment