నదింతే(3-2-99 కి సీక్వెల్)
నదింతే...
అద్దాల పలకల
రాకపోకల ఉత్తరం
నదింతే...
నదిబొడ్డులో విరబూసిన
రెల్లు పూలు
నదింతే...
ఉనికిని రాసుకుంటున్న
ఇసుక గోడ
నదింతే...
కదిలితే తప్ప
ప్రాణం పొందని
పచ్చటి బుడగ
నదింతే...
పంటకాలువలో నెలవంక
బీజం ప్రతిబింబం
నదింతే...
తూర్పార పట్టిన
మబ్బుకంకుల కుప్ప
నదింతే...
పంటకాలువ గట్టు
దప్పిక గొంతుక
నదింతే...
కదిలితే తప్ప
ప్రాణం పొందని
పచ్చటి బుడగ
నదింతే...
రైతు కళ్ళలో
నీటీపొరల గుట్ట
నదింతే...
ఆత్మహత్యల గోరీలపై
పొగమంచు సాంబ్రాణి
నదింతే...
విత్తన గర్బంలోని
సమాధి మన్ను
నదింతే...
కదిలితే తప్ప
ప్రాణం పొందని
పచ్చటి బుడగ
నదింతే...
నిన్న
చూపుల మైదానం
కొండ లోయల
కరచాలనం
వంకవాగుల
కలయిక
నేడు
ఇసుక హోరు
నీటి
పోరు
దోపిడి
సరుకు
రేపు
యేటి ఒడ్డున
ఒంటరి వృక్షం
ఛిట్లిన నరాల పై
చెమట చుక్క
యుద్ధ ఢంకా
నదింతే...
మట్టి వ్యోమగామి
కదిలితే తప్ప
ప్రాణం పొందని
పచ్చటి బుడగ
(శ్రీకాకుళం,కృష్ణా జిల్లా,25-10-12)
baavundi satya
ReplyDeleteబాగుంది
ReplyDelete