Posts

Showing posts from February, 2016

అవును

కొందరు  నిష్క్రమించినా ఇంకా వున్నట్టుగానే స్మరించుకుంటాం గాలి వీచినప్పుడు మర్రి  కొమ్మ ఆకులు రెపరెప లాడుతుంటే కోయిల వీడ్కోలు ,కలయికలని ఒకే  స్వర పేటికలో పాడినట్టు  మర్చిపోయిన పెద్ద బాలశిక్ష  పుస్తకంలో నానేసిన బీజాక్షరాలు మొలకెత్తుతున్నట్టు అవును వాళ్ళ మట్టి మీద మన తడి అరికాలి రేఖలు ఇంకుతున్నట్టు సమాధి పైన కాలాన్ని చెక్కినట్టు అవును వాళ్ళు నిష్క్రమించినా ఇంకా వున్నట్టుగానే స్మరించుకుందాం! మనం ఇక్కడ ఇలా కొంతసేపు ఇంకొద్ది సేపు వుండిపోదాం. చివరి మజిలీ వాటికలో మళ్ళీ ఇంకెవరో మరెవరినో స్మరించుకునేoదుకు వచ్చే లోపు లేలేత పచ్చిక మీద మంచు బిందువుల ఉయ్యాలలో మన వూసల ఘడియల ప్రతి బింబాలు పూసినట్టు. ప్చ్... కొంతసేపు ఇంకొద్ది సేపు ఇక్కడే గడిపేద్దాం అవును ఆకులు రాలే కాలంలో లోలోపల అరుణం మోదుగ పూల గుచ్చంలా సంభాషించుకుందాం ( 22-2-2016) ( నా కిష్టమైన కొన్ని  మిగిలివున్న పచ్చని చివరి మజిలీ వాటికలకి,అందులోని ఆప్తులందరికీ)

మాటలు లేని పక్షి

ఒకప్పుడు సముద్రపు  ఒంతెన పైన కోరికల కంచె కట్టాను అల ఓ తాళం కప్ప ఒడ్డు ఎవరో జ్ఞాపకాల దీపం రేవెమ్మటే ఎవరెవరివో తడిపాద ముద్రలు రెప్పపాటు కాలంలో అలరెక్కల్లో రంగులై పోతాయి నేను లైట్ హౌజ్ అందరూ ఇళ్ళు చేరే సమయానికి కొంత వెలుగల్లుకుని కూర్చుంటాం దూరంగా ఇంకా సేద తీరని వయస్సులా పడక కుర్చీలోని చూపొకటి వాటితో పాటు కొన్ని డచ్  సమాధులు మా చెవుల్లో గుసగుసలాడుతాయి ఇసుక రెక్కల గూళ్ళల్లో తాబేళ్ళు నడిరాత్రిలో రాలిన నక్ష త్రపు కాంతి  గుడ్లు పొదిగి వెళతాయి మర్నాడు సూరీడు లైట్ హౌజ్ కిటికీ లో నుండి మా విధిలోకి చేరతాడు. బహుశా ఇప్పుడు చిరిగిన  తెరచాప పడవొడ్డులా పడక కుర్చీలో అనవాలులేని సీగల్    చలనం లేని తెడ్డులా మర్రిమాను ఊడ ఉదయ సంధ్యల ఎర్రమట్టి దిబ్బల రంగులస్తికల్ని సముద్రంలో కలిపేస్తున్న కుబుసంలా సూరీడు (  ఎప్పటివో భీమిలి సంద్రపు ఒడ్డెమ్మటి  పాత ఇళ్ళు 1992-94, ఇప్పుడు జ్ఞాపకం వచ్చి ) (9-2-2016)   ...