పూల పుప్పొడి (ట్రిబ్యూట్ టు జి.ఉదయ్ భాస్కర్)

 

కొన్ని జ్ఞాపకాలు భలే ముచ్చటగా వుంటాయి.పూల పుప్పొడిలా... కొన్ని పూలని తాకి తర్వాత యాధ్రుచ్చికంగా ముక్కు మీద ,బుగ్గ మీ, నుదుటిన చెయ్యి పెట్టినప్పుడు, వేళ్ళకి అంటుకున్న పూల పుప్పొడి అక్కడంతా అంటుకుంటుంది.జ్ఞాపకాలూ అంతే !కొద్ది పాటి ఆనందాన్ని, బాధని, కించిత్  జ్ఞానాన్ని ఇస్తాయి.  అవి మనని కాసేపు మనోలోనే ,మనతోనే  ఆగేటట్లు,మాట్లాడుకునేట్లు చేస్తాయి. ఆ జ్ఞాకాలకు రూపం ఇచ్చిన ప్రదేశాలు, సంఘటనలు, వ్యక్తులను నెమరోస్కోమని! అప్పుడు మన ఆలోచనలు కొత్తగా మొలకెత్తుతాయి.  .మరి ఎటు చూసినా ఆ వ్యక్తి రూపం చాలా వాటిల్లో ప్రతిరూపమో, ప్రతిబింబమో అయితే ? అది కేవలం జ్ఞాపకం కాదు,పూల పుప్పొడి  నరనరాల్లో జీర్ణించుకు పోయిన రక్తం అయితే....అది నాకు మటుకు గుడ్లవల్లేటి ఉదయ్ భాస్కర్,రఫ్  బాచి,మా మూడో అన్నయ్య.........

తను సింగరేణి కాలరీస్ ఎక్స్ప్లోరేషన్ డివిజన్ నుండి మేనేజర్గా రిటైర్ అయ్యి. హైదరాబాద్ లో సెటిల్ అవుదామని నగరం అంతా తిరిగాడు ఇల్లు కోసం. తనకు  మటుకి తెల్సు ఎటువంటి ఇల్లు కావాలని.చివరికి షామీర్ పేట్  ధ్యాన్యప్రస్తా లో ఒదిగాడు. అందరూ  అంత దూరం ఎందుకు అని అడిగిన వారే! తను మటుకు కేవలం నాల్గు గోడల ఇల్లుని కాదు వెతికింది.ఆ గోడల కంటే ముఖ్యంగా వుండే చుట్టూ వుండే ఖాళీ స్ధలాన్ని, ఆ ఖాళీలని తన ఇష్టానుసారం మొక్కలతో  పూరించి , వాటితో  సహజీవనం చేయాలన్న ఆశతో !

ప్రస్తుత  కాలంలో ఇల్లు అంటే కేవలం నాల్గు గోడలు, వాటికి వుండే మార్కెట్ వాల్యూ  తప్ప,అందులోని కుటుంబం, జీవనం కాదు. అందుకే ఇల్లు ఇప్పుడు ఒక ఇన్వెస్ట్మెంట్,స్టేటస్ సింబల్,కమాడిటి  తప్ప, లివింగ్ స్పేస్ కాదు......

ఇక్కడ ఫౌన్టెన్ హెడ్ పుస్తకం లోని వాక్యాలు గుర్తుకు వస్తాయి.

We live in our thoughts ,existence is the transformation of thoughts into reality. We build houses as a monotonous activity

కాని తనకి మటుకు ఇల్లు మారడం అంటే...

ఇళ్ళు మారడం

ఇళ్ళు మారడం

శిశిర

వసంతంలాగుండాలి

నేల

ప్రతివక్కరి

గూడవుతుంది

మట్టిగంధానికి

తొలకరి

తడిలా...

అలా కేవలం ఒక మూడు ,నాల్గు ఏళ్ళల్లో ఇంటి చుట్టూ సుమారు  1500 వందల మొక్కలు నాటేశాడు. కనీసం 60,70 రకాలు.  వర్మి కంపోస్ట్ చేస్కునే వాడు.లేచిన తర్వాత, బ్రేక్ ఫాస్ట్ అవ్వడం ఆలస్యం తన ప్రపంచం అంతా  మొక్కలతోనే

 


 

 జీవితం లో ఒక పటిష్టమైన అభిరుచి వున్న వాళ్లకి రిటైర్మెంట్ అంటే తమ ఇష్టాలతో,ఇష్టంగా జీవించడం. ఉద్యోగం జీతం ఇస్తుందేమో కాని,జీవితాన్ని కాదు కదా!ఒక కాలంలో కొందరు ఇంత దూరం ఎందుకు అన్న వాళ్ళు, ఇప్పుడు మరి కొందరు ఎప్పుడూ మొక్కలతోనేనా అని ఆశ్చర్య పోయారు.  ధాన్యప్రస్తానం  అంటే ధ్యానికి...

ధ్యానులు

ఇంద్ర ధనుస్సు

వాళ్ళ కళ్ళల్లో

కాటుకద్దుకుంటుంది

ఆలోచన వేగంతో

నడిచే

ప్రవక్తలు.

ఆన్త్రోపోసిన్ కాలంలో ఆర్టి ఫిషియల్  ఇంటెలిజన్స్ కంటే వేగంగా పెరిగేది, ఆర్టిఫిషియల్  ఎక్సాజిరేటేడ్ లైఫ్  స్టైల్ .అదే క్లైమేట్ చేంజ్ కి ముఖ్య కారణం, తను మటుకు దీని గురించి ఉపన్యాసాలు,ఏమి చేప్పకుండా నిశ్శబ్దంగా ఒక మినిమలిస్టిక్ జీవనం సాగిస్తూ బతికాడు. నా మటుకు ధ్యానం అంటే ఎవరినో స్మరిస్తూ కూర్చోవడం కాదు, మనకు బాగా ఇష్టంగా బతకాలనుకున్న తీరు ఇతర ప్రాణులకు హాని చేయకుండా, మన మనస్సు గూడును పచ్చదనం తో నింపేయడమే. అదే బాచి ...బాచి అనే బదులు “బాగ్” జీ  అంటే బాగుంటుంది. ఉర్దూలో బాగ్ అంటే వనం,తోట అని అర్ధం.అతనికి ఉర్దూ  అన్నా చాలా ఇష్టం.దాని గురించి తర్వాత చెప్తా...

 

తను చదువుకున్నది జియో ఫిజిక్స్.అంటే భూమి, దానిని అల్లుకున్న స్పేస్ గురించి .అది కేవలం తనకు  చదువు మాత్రమే కాదు, ఆలోచనా శైలి, ధృక్పధం కూడా.అందుకే అతని స్పేస్ చాలా విస్తారంగా వుండేది. అంటే ఆస్తి పాస్తులు కావు.జీవనశైలి,నడవడిక. ఎప్పుడు చలాకీగా,యంగ్ గా వుండే వాడు. అందరికీ  సహాయ సలహాలు ఇచ్చేవాడు.

నాకు చిన్నప్పుడు నారు మడిని పరిచయం చేసింది తనే. తొలకరి అప్పుడు నేను స్కూల్ నుండి తిరిగి వచ్చేటప్పుడు పబ్లిక్ గార్డెన్స్  నర్సరీ నుండి వివిధ మొక్కల నారుమడి తెమ్మనే వాడు. అలా నాకు నర్సరీ కి వెళ్ళడం, నారుమడిని  తేవడం అలవాటయ్యింది. నారు తేవడం తను నేర్పిస్తే, మొక్కలు పెట్టడం , పెంచడం మా రెండో అన్నయ్య సుబ్బా రావు గారు నేర్పించారు. అదే నాకు ఇప్పటికీ   మొక్కలు  పెంచడమే  కాదు ,వాటితో జీవించడాన్ని అలవాటు చేసింది.

 

శ్రీకాకుళం జిల్లాలో తిరుగుతున్నప్పుడు తొలకరి అప్పుడు వరి నారును నాట్లు వేసేటప్పుడు కనిపించే దృశ్యం

ఊల పాట

గౌరమ్మలు

ముని వేళ్ళతో

నీటి నేల బిందువులపై

తడి మట్టి

ముద్ద మనస్సు

ముఖ చిత్రాలు

వేస్తారు.

 

బాచి అదే పని చేసే వాడు.పని కట్టుకుని ఎవరికీ ఏమీ  నేర్పించడు, తన పని తను చేస్కుంటూ పోతాడు.చాలా విషయాల గురించి విపులంగా, వివరంగా మాట్లాడుతాడు. విషయాన్ని విడమర్చి ,విశ్లేషిస్తాడు.తనతో మాట్లాడడం ,చర్చించడం ఒక విద్యాభ్యాసం. అలా తన ద్వారా చాలా అంశాలు నేర్చుకున్నాను. అంతే కాకుండా  ఇతరులతో మాట్లాడాలంటే ముందుగా వినడం నేర్చుకోవాలి అని నేర్చుకున్నాను. అది నేడు అంతరించి పోతున్న లక్షణం.

అనుకోకుండా మమ్మల్ని అందరినీ విడిచి రెండేళ్ళ క్రితం వెళ్ళిపోయాడు. ఇది జరగక  ముందు తను మొట్టమొదటి సారి నాకు వాళ్ళ స్నేహుతుడు పంపిన ఉర్దూ కవితని నాకు పంపి అనువాదం చెయ్యమన్నాడు. నేను గమనించి నది ఆ కవిత అతకి చాలా దగ్గరిగా వుంటుంది. నేను అనుసృజన చేసి పంపినదాన్ని మెచ్చుకున్నాడు. అది కూడా యన చలవే, నాకు ఉర్దూ గజళ్ళను  పరిచయం చేసింది తనే. అదే నన్ను కవిత్వం వైపు తీసుకు వెళ్ళింది.

జిందగీ

గతించిన  జీవితం  గురించి బాధపడకు

నుదిటి రాతలో ఏమి రాసుందో దాని గురించి ఫిర్యాదు చెయ్యకు

జరిగేదేదో జరుగక మానదు

రేపటి గురించి బెంగతో

నువ్వు ఇవ్వాల్టి  సంతోషాన్ని నాశనం చేస్కోకు

హంస చనిపోయేటప్పుడు కూడా  పాడుతుంది

నెమలి నృత్యం చేస్తూ కూడా ఏడుస్తుంది

ఇది బతుకు  తీరు బాస్ !

దుఃఖపు రాత్రుల్లో నిద్ర కూడా రాదు

ఇంక సంతోషంగా వున్న రాత్రుల్లో ఎవడు పడుకుంటాడు

మాట ఒక్కటే దారి

మనిషిని మనస్సులోకి దించేస్తుంది

లేకపోతే గుండెల్లోనుండి తీసుకెళ్ళిపోతుంది

బతుకు ఒత్తిడిలో నేను చాల బిజీ అయిపోయాను

కాని, టైం లేదని చెప్పి మనుషుల్ని మర్చిపోవడం

నాకు ఇప్పటికీ చేతకాదు

దోస్తులు  జ్ఞాపకం రానప్పుడు

ఆ ఒంటరితనం ఎందుకోసం

తెగిపోయిన బంధాలు మళ్ళీ కలవపోతే

అప్పుడు దేవుడు ఎందుకు ?

అనుమానం ఏమీ లేదు

మనం గమ్యం చేరాలి

ఆ గమ్యం నుండి దోస్తులు కనపడకపోతే

ఆ శిఖరం ఎందుకు ?

మత్తు ప్రేమది కావచ్చు

మధువుది కావచ్చు

లేక వాట్స్ అప్ ది అవ్వొచ్చు

కైపులోనే మత్తుని మర్చిపోతాం

తేడా ఒక్కటే !

మధువు నిద్ర పుచ్చుతుంది

ప్రేమ ఏడిపిస్తుంది

ఇంక వాట్స్ అప్ ...

దోస్తుల్ని జ్ఞాపకం చేస్తుంది !!

 

బాచి ఎవ్వరినీ  మరచిపోడు, అతన్ని ఎవ్వరూ  మర్చిపోలేరు.ఆతను చనిపోయిన తర్వాత రోజు, హారిక(సోను,బాచి కూతురు)ఆయన  అల్మారా సర్దుతూ అక్కడే వున్న మమ్మల్ని పిల్చింది. వెళ్లి చూస్తున్నాం ఎందుకు పిలిచింది అని,పిన్నీ,ఇదిగో అని ఒక సంచి ఇచ్చింది.అందులో  తరువాత సీజన్ కోసం  తను దాచి పెట్టుకున్న తనకు, మాకు చాలా ఇష్టమైన..... వివిధ పూల చెట్ల విత్తనాలు.............

నాకు అనిపించింది ఈ విత్తనాలు పూలమొక్కల దుస్తుల్లా ఎదిగితే ఎంత బాగుండు అని ! చిన్నప్పుదు నాకు కాటన్ బట్టల  మీద మోజు కల్గించింది ఆయనే , అప్పుడు ఆయన బట్టలు ఎప్పుడు తనకు  పొట్టివి అయిపోతాయా నేను వాట్ని ఎప్పుడు దక్కించు కుందామా అని ఎదురు చూ సేవాడ్ని.

ఇప్పుడు అర్ధ మైంది ఆయన దుస్తుల్ని కాదు నేను తొడుక్కున్నది , ఆయన ఆలోచనల్ని, దృష్టిని అని !

ఇలా విత్తనాలు దాచుకోవడం  నేను మణిపూర్ లో మరో రకంగా చూశా...

వాల్ పెయింటింగ్స్

మట్టి గోడలలో

విత్తనాలు అలికి

దాచారు

వాకిళ్ళలో

పసిడి పచ్చదనం

అద్దాల గింజలు

పొదిగినట్లు

ఆ అల్మారా తెరచి ఆ సంచిని పొందడం అంటే మట్టిలో ఒదిగిపొయిన పూల పుప్పొడిని తాకడమే. దానికి చేయాల్సిందల్లా..కుల్జా సిం సిం.... అని స్మరించడం.

(ఇక్కడ పేర్చిన జిందగీ కవిత తప్ప మిగితా కవితలన్నీ ఈ మధ్యనే వెలువడిన,బాచికి అంకితం ఇచ్చిన  నా పుస్తకం మిడ్ నైట్ రైన్ అండ్ డే డ్రీ మర్స్ లోనివి,ఛాయా రిసోర్స్ సెంటర్ ప్రచురణలు,)

 

(సశేషం)

 

 

Comments

  1. What a lovely tribute to Bhaskar! I used to frequent your home as a school kid, and Bhaskar to me represented passion for volleyball and fitness. I watched many of his exploits with his team at ‘chintal grounds’. You have written a sensitive loving portrait of the man who should be rightfully called ‘baag’chi for his unbelievable love and passion for plants and nature.
    Your tribute is moving, speaking of a younger brother’s affection for the older one who has been a hero and lit up lives around him, including those of plants. Om Shanti🙏

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

పిల్లల చెట్టు

గూళ్ళ రెక్కలు