Posts

Showing posts from November, 2013

అడవి గింజ

మిట్ట మధ్యాహ్నం  ఒంటరి నడక  ఆలోచనడుగుల ఘోష కళ్ళ నీడలా వెన్నాడుతూనే వుంది భూమినుండి పెకిలించేస్తున్నట్టు పుట్టుకొస్తున్న క్రికెట్ పురుగు చప్పుడు ఓ ఆత్మప్రవచన గీతంలా సదా వినిపిస్తూనే వుంటుంది కనుచూపు మెరలో కానరారెవరు అడవి మొదట్లో... వూరి చివర్లో... పొలిమేర గట్టున గుళ్ళలా మర్రి మానులో తాటి చెట్టో తాటి చెట్టులో మర్రి మానో ఒకదానితో ఒకటి పెనవేసుకుని పక్షి రెక్కలతో నీలి గగన రంగుని మట్టి వేర్లకి పొదుగాలన్న వాంఛతో అయస్కాంత శక్తిని దాటి పోతున్నాయి... నా పయనమంతా ఈ ద్రుశ్యమల్లిన పిట్ట కూతంత  గింజ స్పర్శని  ఆలింగనం చేసుకునేందుకు అన్వేషణే... (2-11-13)

నీటి నీడలు

చెరువులోని రాయి పైన నీటి కాకి ఒడ్డు మీద బండల పైన  నేను నీటి మరకలతో రాతలు రాస్కుంటూ

లోలోన

నా లోకి రాత్రి ఓ తడిసిన మట్టి నాలుక లా జొరబడుతుంది దేహమంతా సుదూర అడవి  గొంతుకుల ఆలాపనలా రంగులేని కళ్ళలోన ఓ దివిటీ వెలుగు నన్ను తట్టి లేపుతున్నట్టు ఎవరో లాగా నా రూపం దాల్చి నా దేహానికి నేనే ఆత్మని పొదుగుతా నాలో నేనే ఓ శరణార్ధిలా గూడులోని గుడ్డులోని పచ్చసొనలా కనుల్లోని పగటి రంగుల ప్రవాహంలా ప్రవహిస్తూ లోలోనే బాహ్య ప్రపంచాన్ని అల్లుకుంటా ఎటూ రాని రోజు కంటే ఖచ్చితంగా వచ్చుండే చీకటికి కొత్తనీరులో కలిసిన మట్టికి చేప నేత్రాలతో వెన్నెల సరంగులా అటూ ఇటూ కదులుతూ . నీటి గాలి బుడగలతో ముచ్చట్లాడుకుంటా... (27-10-13)

అద్దాల పలుకులు

Image
ఛోటూ  మంచం పైన కింద నవ్వారు మంచం ఊయలల్లోలా నేనూ తనూ  చాప మీద పడుకుంటాం కిటికి అద్దాల నుండి దోబూచులాడుతూ చంద్రుడు  కిటికి అరుగుమీద మొక్కలు, చెక్క బొమ్మలతో కబుర్లు చెప్పుకుంటూనే రాత్రిని  గడిపేస్తాడు పొద్దున్నే పక్షులు కిటికి అద్దాలను తడుతూ రాత్రి ముచ్చట్లు తెలిసిపోయాయన్న ఆనందంతో చప్పట్లు కొడతాయి (4-8-13)