Posts

Showing posts from March, 2014

ఆకుపచ్చని నీడ రంగులు

పాము తలకాయున్న గొంగళి పురుగు ఆకులపై డొల్ల ముఖచిత్రాల్ని గీస్తూ వుంటుంది ఆ ముఖచిత్రాలనుండి ప్రసరించే సూర్య కిరణం తాకిన నేల కాంతి విస్ఫోటనం నుండి మొలకెత్తిన సీతాకోక చిలుక నాకళ్ళలోని ఆకాశానికి రంగులద్దుతూ పయనిస్తుంది (18-3-14)

శిశిరం

గొంగళి పురుగు- ఆకులకి బొత్తాలు కుడుతున్న దర్జీ ---------- సీతాకోక చిలుక- రంగుటాకుల దుస్తుల్ని గాలికి అమ్మే విదూషకురాలు ------------- విరగ కాసిన ఛెట్టు కొమ్మ- కొమ్మలకంటుకున్న ఉసిరి పిందెలు పసికందు పెదవుల పై చనుపాల చుక్కలు --------- చంద్రుడు చీకటి కిటికీ కంటుకున్న సాలీడు నేత్రం (15-3-14) -------- పున్నమి వెన్నెల రాత్రంతా వాంఛ నెగళ్ళు ఉదయం బూడిద పుప్పొడిలా దేహనది రంగుల హరివిల్లు (15-3-14) ------------- పున్నమి శిశిరం- పసిడి కలల బోసి నవ్వు (17-3-14) ---------- శిశిరంలో పున్నమి దారి- రాత్రి- రహదారి చివర్న వెలుగుతున్న సోడియం లైట్ ఉదయం ఇంకా వెలుగుతున్న దారిలోని స్ట్రీట్ లైట్ (18-3-14)  --------- ప్రయాణం- ఎండుటాకుల దారిలో మంచు బిందువుల చిగురులు (18-3-14)

శిశిర పిచుక-

కనిపించని తల్లి  పిలుపు కళ్ళగొంతుకల దాహార్తిని తీర్చే గూడు (20 మార్చ్ -  అంతర్జాతీయ  పిచుకల దినోత్సవం)

మోదుగ చంద్రవంక

అర్ధచంద్రాకార కిటికీ అద్దం రాలిన చుక్కతో పడుకున్న నేను ఆకులు పూలైన మోదుగ వనంలా ఓ నగ్నాకాశం నేల వాంఛల  పచ్చని పున్నమి  వెన్నెలదారుల కలయిక  మనస్సు  చూచుక కళ్ళలో  ఒకే దృశ్యమైన కనుపాప బీజం (నా ప్రయాణంలో వెన్నంటే వుండి, వచ్చిన మోదుగ పూలకి) (11-3-14)

ఎండుటాకుల మది

ఒక్కోసారి  మనస్సు కాలం అర్ధరాత్రిలోని ఆసుపత్రి గది కంటి చికిత్స తర్వాతో గుండె పోటు తర్వాతో ఆద మర్చి పడుకున్న తల్లికో, తండ్రికో తోడుగా మేలుకున్న క్షణం కిటికి బయటున్న  చింతమానుతో మాట్లాడుకున్న ఘడియలు బయటకు వచ్చి పెదవులపై తగలెట్టిన కాష్ఠం పొగలు పొగలుగా వైతరణిలో అస్తికలు  ప్రవహించిన ఆనవాళ్ళు ఇప్పుడు  అటువైపుగా వెళుతున్నప్పుడు కొద్దిసేపు ఆగి చూస్తాను మానులు లేని ఆ ప్రదేశాన్ని టీ పొగలు లేని శూన్యపు ఉదయాన్ని తల్లిదండ్రుల మనోవేదన గీతాన్ని వింటూ భార్యాపిల్లాడిని తలుచుకుంటూ రంగు కాగితం లేని జేబులగుండా గుండెని తడుముకుంటూ చింతాకుల వర్షం లో తడిసిపొతు ఎండుటాకుల  మదిలో పాదముద్రలు లేని  అడుగుల సవ్వడిలా  ఛివరొక్కసారిగా కదిలిపోతాను (28-2-14)