Posts

సంభాషణ రేఖ

ప్రతి ఉదయం పిచుక ముక్కుతో సూర్య కిరణం   కిటికీ అద్దం మీద చప్పుడు చేస్తుంది సరిహద్దులంచున నిల్చున్న నిర్వాసితుల్లా పిచుక , నేను పలకరించుకుంటాం   అరి కాళ్ళల్లో గుచ్చుకున్న ముల్లు అద్దంలో చూపై నిలుస్తుంది ఎర్ర గులాబి లా ఉదయం విచ్చుకుంటుంది   ఎప్పటికి చెరగని రేఖా చిత్రాల్లా పాత ఊసులు కొత్తగా చిరుగించుకుంటాయి మాయని గాయాల్ని జ్ఞాపకం చేసి తిరిగి పిచుక ఎదురుగా వున్న కరెంటు తీగ పైన కుర్చుని అటు , ఇటు తలాడిస్తూ గాలితో కబుర్లు చెప్పుకుంటుంది   నేను కిటికీ అద్దంలో నా మొహాన్ని అరచేతి కళ్ళరేఖలతో తడుముకుంటూ నిలిచిపోతా   పెనవేసుకున్న వెంటనే తెగిపోయే గాలి పటం దారం లా మా చూపులు గర్భసంచి మార్పులో విడిపోయిన మట్టి పిండం లా రేఖా మాత్రా స్ధానంలో అజ్ఞానుతులుగా ఒకే ఉదయాన్ని , ఒకే రేఖ పైన రెండు కోణాల్లో ఒకే సారి అవిష్కరిస్తు , సరిహద్దుకిటికీ రేఖల  ఇనుప కంచలో వేలాడుతాయి ప్రతి ఉదయం ,.. కోడికూతతో పొడవదు సరిహద్దుల యుద్ధంలో మరణించిన అజ్ఞాత  ఆత్మలు గగనంలో కలిసిపోతునట్టు సూర్యుడు సరిహద్దు రేఖ పై పై కి ఎగబాకుతూ వెళుతుంటా...

మనమెవరం ?

ఒకరితో ఒకరు కలవలేక కరచాలనంతో గొంతులు నులిమేస్తాం కలిశామన్న భ్రమతో పడుకుంటాం ఇటుక ముక్కల దేహంలో గాలివాటాన్ని హత్తుకునే గాలి పురుగులం గాలిలో నీటిలో ప్రయాణించే ఆలోచనలకు దాపరికాలుండవు సముద్రంలో ఒదిగిపోయిన వూసుకు ఊహలుండవు ఉప్పునీటి శవ యాత్రలకు ఉప్పెనలుండవు తడి తెలియని వేర్లకి అబద్ధమైతేనేమి నిజమైతేనేమి ఏ అరమరికలు లేకుండా నిద్రవాటికలో ఎవరి ఖాళీలను వారు పూరిద్దాం దారి,తెన్నూ లేని మృత్యువుకి బాటలవుదాం ఎవరైతేనేమి... ? (1997)

తుంపర వర్షం

ఆకులపై నుండి తుంపర్ల  గాలి నను తాకుతూ సాగిపోతుంది పెదవులకున్నముద్దె౦గిల్ని  తడిచేసుకుంటూ  చూపుడు వేలుతో పేజీలు తిరగేస్తున్నాను ఆకు చివరి నుండి బొట్టు బొట్టుగా రాలుతున్న చినుకులు వేర్ల లోకి ఇంకుతూ ఇరు తనువుల మట్టి మనస్సు ఒకటైన వేళలా తెల్ల సంఫెంగల పరిమళం చీకటికి ధూపమేస్తోంది ముగింపు పేజిలో అసలు కధ మొదలైనట్టు   అంతలోనే ఆమె రింగ్ టోన్ ‘ ఇమ్లిబన్ లో బస్ ఎక్కాను ,మొక్కలు జాగ్రత్త ’ ‘ సరే అక్కడ వర్షం వుందా ’ ‘ ఆ.. తుంపర్లు పడుతున్నాయి ’ ఇక చింత లేదు తడిగాలి నమ్మకం ఇరువురికీ డ్రైవరైనట్టు ఇక ఎడబాటు లేని ప్రయాణం కొనసాగుతుంది... (20-9-14)

వెదురు వర్షపు చుక్కలు

Image
వింటి బద్ద బాణం చూపు పశువుల్ని కాచే ముల్లు కర్ర ఇంటి దూలం ముచ్చట్ల తరంగాల  తూనీగ : వెదురాకు రెక్క వెదురుకూర :  గూటిలో మొలిచిన పుట్ట మన్ను పువ్వు వెదురన్నం :నేలగంధ  పరిమళపు బువ్వ రాత్రింబవళ్ళ గాలి రాగాల  నదీ గీతం :వెదురు వేణువు వెదురు పొదల సవ్వడి ; వెన్నంటి  కాచే గురవడి [1] పలుకులు నా అడవి గుండె చప్పుడు : :పోతరాజు [2] గుఱ్ఱం అడుగుల ముద్ర ముగింపును గెలుపు సంకేతంగా ఎగరేసుకు పోయే పిట్ట : వెదురు పువ్వు మలుపుల దారిలో  ఇంకా కొండ గుర్తుగా  కళ్ళ గడపెదుటే నిల్చే వున్నాయి (ప్రపంచ వెదురు పొదల దినోత్సవం) 19/09/2014 [1] గిరిజన పూజారి [2] వెదురు పొదను పోతరాజు గా పూజిస్తారు 

కాకి మట్టి

యిక కొన్ని వర్షపుచుక్కల్ని దాచి పెట్టుకుంటాను,అవి పాత విత్తనాలే!.ప్రతి ఏడాది పూల మొక్కల విత్తనాలతో బాటు వాట్ని గొప్పి తవ్వి నాటమంటాను.మా కొండ పోడు   గూటిలొ రాత్రిపూట వెదురు పొదలనుండి వీచే గాలి మిట్ట  మధ్యాహ్నం జముడు కాకి దిష్టి బొమ్మలా కూస్తుంది. ఉదయం  కుబుసం  వదులుతూ తన నలుపు రంగులోకి వచ్చేస్తుంది. రంగులన్నీ వర్షపు చుక్కల్లా  మట్టి కంటి గూడులో నిద్రిస్తాయి. యిక నేల నీటి కోసం ఎదురు చూడదు. కూతపాటి దూరంలో మళ్ళి రెండు ప్రాంతాల విభజనకు మూల  వాసుల ఊర్లూ విభజన  గీతను  గీసే చేతి కర్రలయ్యాయి. ఎప్పటి లానే కొండచుగూటిలోని నీటి ఖనిజంగా చేతికర్ర  ఒదిగే వుంది. దూరంగా ... నదిఒడ్డున నగారాల నిర్మాణం విస్తరిస్తోంది. చిన్న రాజధాని పెద్దదవుతోంది. వందల ఏళ్ల  చరిత్ర గల నగరాల్లానే ,నదులూ ఎండిపోతాయి. నది ఒడ్డున మోడు చెట్టునుండి రాలుతున్న ఆకుల్లా వలసపక్షుల  గుడారాలూ  వెలుస్తాయి. చెట్టుకి నేల లేదు, నేలకి నీటి చుక్క లేదు, నగర నిర్మాణానికి మట్టి లేదు. భూమంతా కొందరి గుప్పిట్లోనే బందీ. భూమిప్పుడు బంగ...

గోళీలాట

చెట్లనీడల్లో గోళీలు ఆడుతున్నప్పుడు రంగుటాకుల గొడుగుల కిరీటధారులం వేళ్ళ వింటిబద్ద నుండి వెలువడిన వెలుతురు పిట్టలం రోజంతా స్నేహితులం కప్పల్లా ఎగురుకుంటూ వూరంతా తిరిగొచ్చే వాళ్ళం సాయంత్రానికి గెలిచిన గోళీలని మట్టిలో దాచుకుని ఎవరిగూటికి వాళ్ళు వెళ్ళే వాళ్ళం రాత్రంతా గోళీల్లోని వెలుతురు పిట్ట అరలోని చమురు దీపంలా నక్షత్రం గూటినుండి మమ్మల్ని చూస్తూ వుండేది ఇక ఇప్పుడు ఎదిగిన తర్వాత ఎండిన మోడు గొంతు సీసాలో ఇరుకున్న   గోళీనయ్యాను మిగతా మిత్రులు...! (12-6-14)

పూల రెక్కలోని చిత్రం

నేను ఓ చెట్టుని కౌగలించుకున్నప్పుడు నాలోని వృక్షత్వం నింగిలో తటాకమవుతుంది నేను మటుకు సదా పూల రేకుల్లా... ఎండుటాకుల్లా... వేర్ల మొదళ్ళలో రాలుతూనే వుంటా ఆమె అరికాళ్ళ రేఖలు నా మీదుగా పయనించినప్పుడు తొలకరికి మట్టి చిట్లి వివిధ రంగుల్లో విచ్చుకుంటుంది ఆకాశం తన రంగుల వస్త్రాన్ని ఆరేసుకున్నట్లు తడి మట్టి రాట్నం మీద హస్తరేఖల్లా ముద్రితమవుతున్న చిత్రం అంకురిస్తుంది (9-6-14)